
ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రను రాష్ట్ర అభివృద్ధికి కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రాష్ట్రంలో మరో అభివృద్ధి అధ్యాయం ప్రారంభమైందని ఆయన అన్నారు. విమానాశ్రయంతో పాటు మొత్తం ₹17,415 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాది పడిందని వివరించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశ, విదేశాలతో మరింత చేరువ చేస్తుందని, పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు తీసుకురానుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
అలాగే విద్యుత్ ప్రసార వ్యవస్థల బలోపేతం, జాతీయ రహదారులు, వంతెనల నిర్మాణం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాధనకు దోహదపడతాయని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం ఆయన త్యాగాలకు నివాళి మాత్రమే కాకుండా, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే గొప్ప నిర్ణయమని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్‌మోహన్ నాయుడు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
