
పాలకొండ, ఆగస్టు 19: ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలను అందించడంతో పాటు, ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. “ఇంటింటికీ… మన్యం పోలీస్” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పాలకొండ పట్టణంలోని పెద్దకాపు వీధిలో నిర్వహించారు.
“అవగాహన కలిగి ఉండండి.. సురక్షితంగా ఉండండి.. బలంగా నిలబడండి” అనే నినాదంతో పోలీస్ సిబ్బంది ప్రజలను నేరుగా కలుసుకుని భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
పాలకొండ ఎస్సై ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు–చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ తదితర అంశాలపై రూపొందించిన కరపత్రాలు, స్టిక్కర్లను ప్రజలకు పంపిణీ చేశారు. సైబర్ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలి వంటి అంశాలను వివరించారు.
అదేవిధంగా పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ ప్రజా సేవలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబర్లు తదితర సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత పెంచడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే “ఇంటింటికీ… మన్యం పోలీస్” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీస్ అధికారులు తెలిపారు.
