
హైదరాబాద్: HYDRAAలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్-ఇన్ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. హైదరాబాద్లోని స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఊహించని స్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.
100 DRF అసిస్టెంట్, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కేవలం 150 పోస్టుల కోసం వేలాదిమంది అభ్యర్థులు రావడంతో స్టేడియం పరిసరాల్లో భారీగా రద్దీ ఏర్పడింది. ప్రవేశ ద్వారాల వద్ద జనాలు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
DRF అసిస్టెంట్ పోస్టులకు 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో పూర్తి చేయడం, 6 మీటర్ల దూరం షాట్పుట్ విసరడం వంటి కఠినమైన ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు అధికారులు టోకెన్లు జారీ చేశారు.
ఉద్యోగాల కోసం యువతలో ఉన్న తీవ్ర పోటీకి ఈ భారీ రద్దీ అద్దం పడుతోంది. ఎంపిక పరీక్షలు ఆగస్టు 9న కూడా కొనసాగనున్నాయి.
